హైదరాబాద్ (మెట్రో న్యూస్):

శాసనసభ తొలి రోజు గలాటాపై బీఆర్ఎస్ బృందం బుధవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పోలీసులు, అధికార పక్షంపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నరును కలిశాము- 1000 హామీలతో అధికారంలోకి వచ్చి, 1000 రోజుల నుంచి అన్ని రకాల హామీలను విఫలం చేయడంతో పాటు, పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైన తీరును గవర్నర్‌కు వివరించాము. విద్యార్థులు, యువతను రాహుల్ గాంధీ ఏ విధంగా మోసం చేశారో గవర్నర్ గారికి విజ్ఞప్తి ద్వారా తెలియజేశాము. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన, వారి డిమాండ్లను వివరించాము. మొన్న శాసనసభ సమావేశాల మొదటి రోజు మా పైన ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని వివరించాము. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్ట్ల ద్వారా నిరసన తెలపాలని మేము అనుకున్నాము. తమ హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులమైన మమ్మల్ని సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్‌కు వివరించాము. మాపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. మా పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని తీరును గవర్నర్‌కు తెలియజేశాము. చివరికి కేసీఆర్ గారి చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును వివరించాము. దాంతో పాటు కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని కూడా తెలియజేశాము. హైకోర్టు చెప్పినా శాసనమండలి, శాసనసభలోకి మమ్మల్ని రాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును వివరించాము. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై ఎలాంటి గౌరవం లేదని గవర్నర్ గారికి తెలియజేశాము.
శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ, జరగని అవమానాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దళిత స్పీకర్ పేరిట రాజకీయం చేస్తున్నారని వివరించాము. ‘దళిత స్పీకర్’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని తెలియజేశాము. మాకు స్పీకర్ పైన అపారమైన గౌరవం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీనే ఆయనను ‘దళిత స్పీకర్, దళిత స్పీకర్’ అంటూ అవమానించేందుకు చూస్తున్నదని వివరించాము. అందుకే అది శాసనసభ కాదు, కౌరవ సభ అని అంటున్నామని తెలియజేశాము. అది సభ కాదు, దుశ్శాసన సభ అని తెలియజేసి, మొత్తం పరిస్థితిని వివరించాము- కేసీఆర్ ఇంటిపై దాడి చేస్తూ, హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. ముఖ్యమంత్రే స్వయంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని వివరించాము. కేసీఆర్ లాంటి మహానాయకుడి ఇంటి వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన చావును కోరిన దుర్మార్గం గురించి వివరాలను గవర్నర్‌కు అందించాము. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అంశాలతో పాటు, బయట జరిగిన ప్రతి సంఘటనపైన, మేము చెప్పిన ప్రతి అంశంపైన విచారణ జరిపిస్తామని గవర్నర్ గారు హామీ ఇచ్చారు. మాకు గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నాము.