Take a fresh look at your lifestyle.

రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థుల మెరుపు ధర్నా

0 2

పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాస్తారోకో చేపట్టారు. జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని, తమ విద్యా భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాయదుర్గంలోని లిడ్క్యాప్ ముందున్న జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. తమను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు సంవత్సరాల పాటు కష్టపడి చదివే తమ విద్యా కాలం, భవిష్యత్తు అనిశ్చితిలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన విరమించాలని పోలీసులు సూచించినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారని విద్యార్థులు ఆరోపించారు.

బెదిరింపులతో తమ ఆందోళనలను అడ్డుకోలేరని, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఓ 97ను రద్దు చేయాలి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని విద్యార్థులు మండిపడ్డారు. జీఓ 97పై ప్రభుత్వం వెంటనే పునరాలోచించి, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.