- పరోక్ష బలప్రదర్శన!
- ప్రెస్ మీట్ లక్ష్యం సుస్పష్టం
- కేంద్రం తీరును ఆక్షేపిస్తూనే…
- కాంగ్రెస్ హైకమాండ్‌కు సంకేతం
- సీఎం రేవంత్ రెడ్డి చాణక్యం
హైదరాబాద్ (మెట్రో న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన చాణక్యాన్ని ప్రదర్శించారు. తనదైన వ్యూహాలతో ఇంటా… బయటా రాజకీయ ప్రత్యర్థులను చిత్తుచేస్తున్న ఎనుముల… సోమవారం సచివాలయం వేదికగా కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏదైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా..? అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పరోక్షంగా బలప్రదర్శన చేశారా..? ప్రెస్ మీట్ పెట్టిన అంశం ఒకటైనా… ఆయన లక్ష్యం వేరేనా..? ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు, టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన జనాలకు బహుశా ఇదే అర్థమైందా..? కేవలం మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి… ఇంకా చెప్పాలంటే, ఏఐసీసీ పెద్దలపై ఒత్తిడి పెంచే చర్యగానే దీనిని చూడాల్సి ఉంటుందా..? గాంధీభవన్‌లోనే కాదు ఇతర పార్టీలలోనూ ప్రస్తుతం ఇదే చర్చ జరగడంలో ఆశ్చర్యం ఏమీలేదు! రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో… ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖను ఒంటరి చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి.
మంత్రి ఓఎస్డీ సుమంత్‌పై కేసులు, తాజాగా మంత్రి శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేయడం దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఇక కూతురు సుస్మిత పటేల్ వ్యాఖ్యలను మంత్రి ఖండించకపోవడం… పైగా తనకేం సంబంధం అంటూ మాట్లాడటంతో… కొండా ఫ్యామిలీపై ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర్నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ వరకు అందరూ సీరియస్‌గా ఉన్నారు. ఏఐసీసీ కూడా ఈ వ్యవహారం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే భావిస్తున్నారని సమాచారం. దీనిపై క్రమిశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సీఎం మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధిష్టానం చూసుకుంటుందని… ఎవ్వరూ దీనిపై మాట్లాడవద్దని ముఖ్యమంత్రి వారించినట్టు తెలుస్తోంది.
సీఎం అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతలంతా ఆయన్ను పలకరించారు. సురేఖపై వేటు వేయడమే పరిష్కారమని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు.2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో… కచ్చితంగా చెప్పలేని అయోమయ రాజకీయ పరిస్థితుల్లో… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో హస్తం పార్టీ మేజిక్ విక్టరీ సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనకంటూ ఒక గ్రూపు సిద్ధం చేసుకుంటూనే… తనపై పెద్దగా వ్యతిరేకత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మంత్రి పదవులు దక్కనివారు… స్థానికంగా నాయకులతో పొసగని వాళ్లు అడపాడదపా మాట్లాడుతున్నారు. ఇది ఏ ప్రభుత్వంలోనైనా ఉండేదే! కానీ ఏ మంత్రి కూడా ధిక్కారస్వరం వినిపించలేదు. ఒక్క కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు తప్ప! అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలనే సీఎం కోటరీకి మద్దతు పెరుగుతోంది! అందుకే రేవంత్ రెడ్డి పరోక్ష బలప్రదర్శనకు దిగాల్సి వచ్చింది..! పైగా సచివాలయం ప్రెస్‌మీట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరుకావడంతో… సీఎంకు నైతిక మద్దతు చేకూరిందనే టాక్ వినిపిస్తోంది.