ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు పోరాడతాం.

హైదరాబాద (మెట్రో న్యూస్):
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కార్యాలయంలో చేపట్టిన రెండు రోజుల మహా నిరాహార దీక్ష ముగిసింది. దీక్ష కారణంగా రాంచందర్ రావు రక్తపోటు పడిపోయి.. షుగర్ లెవెల్స్ తగ్గాయి. దీక్షను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్య బృందం హెచ్చరించిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు. దీక్షా శిబిరంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ చేతుల మీదుగా, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు ఇతర ముఖ్య నేతలు రాంచందర్ రావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా దీక్షా ప్రాంగణంలో బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల గోడు పట్టదు కానీ, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ పర్యటనల పేరుతో విదేశాల్లో విహరించడానికి సమయం దొరుకుతుందన్నారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. “నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆగదు. ప్రభుత్వం మొండివైఖరి వీడి రూ.15,000 కోట్ల బకాయిలను పైసా పైసా చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం. విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు.