హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలమార్గం గుండా ప్రయాణించే భారత వాణిజ్య నౌకలకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇరాన్ పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ వైస్ ఛైర్మన్ హయత్ మొఘద్దమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాల వాణిజ్య నౌకల రాకపోకలపై హర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు ఉండవని హయత్ మొఘద్దమ్ స్పష్టం చేశారు. ఈ దేశాల నౌకలు యథేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికా సైతం వీటిని అడ్డుకోకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. చైనాకు రాజకీయ కారణాలతో, భారత్‌కు ప్రధానంగా ఔషధాల దిగుమతిని సులభతరం చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. అయితే, భారత్, చైనా దేశాల నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు నిర్దేశిత ట్రాన్సిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు, ఖతార్ నౌకలకు మాత్రం ఎటువంటి రుసుము లేకుండానే అనుమతి కల్పించడం గమనార్హం. ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.