- మార్చిలోనే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడి
- ప్రపంచవ్యాప్తంగా 3.73 లక్షల మరణాల అంచనా
- నైజీరియాలో 56 వేల మరణాల ప్రమాదం ఉందన్న క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్
- ఎల్‌నినో ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం
భారత్‌కు ఎల్‌నినో రూపంలో మరో వాతావరణ ముప్పు పొంచి ఉందా? రాబోయే నెలల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు ప్రాణనష్టాన్ని పెంచే ప్రమాదం ఉందని తాజా పరిశోధన ఆధారిత అంచనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ రూపొందించిన కొత్త ట్రాకర్ ప్రకారం.. 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి వరకు భారత్‌లో అధిక వేడి కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉంది. వీటిలో ఎక్కువ భాగం మార్చిలోనే నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా.
ఇది వాతావరణ సమాచారం, ఉష్ణోగ్రతల అంచనాలు, గతంలో వేడికి సంబంధించిన మరణాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రూపొందించిన నమూనా అంచనా మాత్రమే. వాస్తవంగా ఎంతమంది మరణిస్తారో ఇది కచ్చితంగా చెప్పడం లేదు.
ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా ఈ ఏడాది ఎల్‌నినో బలంగా ఉందని, డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావాలు 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని అంచనా.
కొత్త ట్రాకర్ అంచనాల ప్రకారం.. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా అధిక వేడి కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 3.73 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ఆరు నెలల కాలంలో నైజీరియాలో 56 వేల మరణాలు, భారత్‌లో 55 వేల మరణాలు సంభవించవచ్చని అంచనా. ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్‌లో 19 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ట్రాకర్ పేర్కొంది.
అయితే ఈ అంచనాలు మరణాలు తప్పనిసరిగా జరుగుతాయని చెప్పడం లేదు. ముందస్తు హెచ్చరికలు, తాగునీటి సదుపాయాలు, చల్లదనం కల్పించే కేంద్రాలు, బయట పనిచేసే కార్మికులకు రక్షణ, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.