హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం
- అన్ని పార్టీ నేతల సూచనలను
పరిగణనలోకి తీసుకుంటాం - డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో
సచివాలయంలో ఆల్-పార్టీ మీటింగ్ - హాజరైన ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, అవసరమైన సమయంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమష్టి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తం, తుమ్మల, పొంగులేటి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నోడల్ అధికారి రామక్రిష్ణారావులు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్, టీడీపీ, జనసమితి, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు పాల్గొన్నారు. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రైతులకు అండగా నిలిచే చర్యలు, తాగునీరు–సాగునీటి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, విపత్తు పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నేతలు ప్రస్తావించిన అంశాలను నమోదు చేసుకున్నామని, సాధ్యమైన మేరకు వాటిని ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రానున్న నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన సన్నద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష నేతలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.