(మెట్రో ఈవినింగ్)
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భ జలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కరువు పరిస్థితులు, మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని అన్నారు. ఈ నెలాఖరు నాటికి, వచ్చే నెలలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను ప్రజలకు వివరించాలని, అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రస్తుతం రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న వానాకాలం పంటను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండవ పంట సాగు చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని సూచించారు.
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం:
రాబోయే యాసంగి సీజన్లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేదని మంత్రి తెలిపారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, ఇతర తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని, రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బిందు సేద్యం ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.
రెండవ పంటకు సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి తక్కువ నీటితో పండే పంటలకు తడులు అందించే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఎక్కడా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలని, పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం:
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయవద్దని, అవసరమైతే మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ పరిధిలోని రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వరకు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్‌హౌస్‌లను వినియోగించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని తెలిపారు.
పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సమీపంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టను పెంచి సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది నీటి ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని, పైపులైన్ల లో లీకేజీలను అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.