Take a fresh look at your lifestyle.

నేడే స‌ద్దుల బ‌తుక‌మ్మ‌…..

0 18

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో
    ట్యాంక్‌బండ్‌పై ప్ర‌త్యేక వేడుక‌లు
  • కనువిందు చేయనున్న లేజర్‌ షో!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబ‌రాలు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. దీనికోసం ఊరూ, వాడా, ప‌ల్లె, ప‌ట్ట‌ణం ముస్తాబ‌య్యాయి. చిన్నారులు, ఆడ‌ప‌డుచులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌ద్దులు చేసి… తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేర్చి… వాటిచుట్టూ ఆడిపాడి… ఆఖ‌రుగా పోయిరావ‌మ్మా అంటూ నిమ‌జ్జ‌నం చేసే వేడుక… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల‌కు అద్దం ప‌ట్ట‌నుంది. ఇంకా దాండియా, కోలాటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణకానున్నాయి. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ స‌ద్దుల బ‌తుక‌మ్మ ఆడంబ‌రంగా జ‌ర‌గ‌నుంది. ట్యాంక్‌బండ్‌పై రాష్ట్రస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. సినీ తారలు సందడి చేయనున్నారు. సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హాజరు కానున్నారు.

సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి సాయంత్రం 4 గంటలకు మహిళలు బతుకమ్మలతో భారీ ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు.
తెలంగాణ కళలు, జానపద సంప్రదాయాలను ప్రతిబింబించేలా 700 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యఅతిథిగా గ‌వ‌ర్న‌ర్ శుక్లా దంప‌తులను ఆహ్వానించారు.
ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్‌రోడ్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.
సద్దుల బతుకమ్మ సంబరాల్లో లేజర్‌ షో కనువిందు చేయనుంది. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Leave A Reply

Your email address will not be published.