Take a fresh look at your lifestyle.

మూడు నెలల్లో రోహిత్‌ వేముల బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి

0 17

హైదరాబాద్ (మెట్రో న్యూస్):-

విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ఉన్నత విద్యాసంస్థల్లో కుల, సామాజిక వివక్షను నిరోధించే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదాను మూడు నెలల్లో సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ రెండో సమావేశంలో బిల్లు రూపకల్పనపై చర్చించారు. నిర్దేశిత గడువులో ప్రాథమిక ముసాయిదాను సీనియర్‌ సివిల్‌ సర్వెంట్ల కమిటీకి సమర్పించాలని, ప్రక్రియలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బిల్లు రూపకల్పన బాధ్యతను షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ (ఎస్‌సీడీడీ) చేపట్టాలని భట్టి సూచించారు. కమిటీలో న్యాయశాఖకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు విద్యాశాఖ, హోంశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తదితర సంస్థల భాగస్వామ్యాన్ని పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పౌరసమాజ సంస్థలు, విద్యారంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి ముసాయిదా రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్ష నిరోధానికి అవసరమైన చర్యలు, చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు, బిల్లు రూపకల్పనలో న్యాయపరమైన, సాంకేతిక అంశాలపై నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. నిబంధనల రూపకల్పనలో సహకరించేందుకు నల్సార్‌ అంగీకరించినట్లు ఎస్‌సీడీడీ కార్యదర్శి విజయేంద్ర బోయి వివరించారు. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, వివక్షకు తావులేని విద్యావాతావరణాన్ని నెలకొల్పడం, చట్టం అమలుకు అవసరమైన వ్యవస్థలను స్పష్టంగా రూపొందించడంపై సమావేశం దృష్టి సారించింది అన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఉన్నతాధికారులు, న్యాయవాది దిశా వడేకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.