Take a fresh look at your lifestyle.

వన్ షాట్.. టూ బర్డ్స్

0 23
  • రేవంత్‌ది డిఫరెంట్ స్టైల్!
  • కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందే అమరవీరుల కాలనీ
  • ఆపలేడు, ఉండనీయలేడు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు, వ్యూహాలకు కేంద్ర బిందువైన సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని వివాదాస్పద భూములపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. సర్వే నంబర్ 325 లోని భూముల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా అమరవీరుల కాలనీ నిర్మించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దశాబ్దాల పాటు అధికారానికి నిలయంగా ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న భూములను నేరుగా అమరవీరులకు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయడం రేవంత్ మార్క్ రాజకీయం అనుకోవచ్చు.

భౌగోళికంగా ఈ సర్వే నంబర్ 325 ప్రాధాన్యతను పరిశీలిస్తే.. ఇది కేసీఆర్ ప్రైవేట్ ఫామ్‌హౌస్ ప్రహరీ గోడల సమీపంలో, దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న భూమి. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లోని లొసుగులను వాడుకుని, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను కేసీఆర్ కుటుంబం , వారి బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఫామ్‌హౌస్ పరిధిలోకి కలుపుకున్నారని రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల నిర్వహించిన సమగ్ర పొజిషన్ సర్వేలో సర్వే నం. 325లోని వివాదాస్పద భూములు అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లో తేలడంతో.. ఆ స్థలాన్ని స్వాహా కాకుండా స్వాధీనం చేసుకుని, అక్కడే నేరుగా
ఉద్యమంలో అమరులైనవారికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ సెంటిమెంట్‌ను, అమరవీరుల త్యాగాలను తమ సొంత రాజకీయ పెట్టుబడిగా మలచుకుని అధికారంలోకి వచ్చిన బీఆరఎస్.. పదేళ్ల పాలనలో నిజమైన ఉద్యమకారులను, బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను పూర్తిగా విస్మరించిందన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ఫామ్‌హౌస్ గుమ్మం ముందే అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీ నిర్మించడం ద్వారా.. గులాబీ బాస్‌కు మానసికంగా, రాజకీయంగా అతిపెద్ద చెక్ పెట్టారు. ఒకవేళ బీఆరఎస్ లేదా కేసీఆర్ కుటుంబం ఈ భూమి కేటాయింపులపై న్యాయస్థానాలకు వెళ్లినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. అమరవీరుల ఇళ్లను అడ్డుకుంటున్న కేసీఆర్ అనే నెగెటివ్ నేరేటివ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చన్నది కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.

ఫామ్‌హౌస్ భూములను చట్టబద్ధంగా వెలికితీసి అమరవీరులకు పట్టాలుగా మార్చే దిశగా అడుగులు వేయడం ద్వారా రేవంత్‌రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టారు. అటు గత ప్రభుత్వ అక్రమ భూ బాగోతాలను బట్టబయలు చేస్తూనే, ఇటు తెలంగాణ అమరవీరుల త్యాగాలకు కాంగ్రెస్ ఇచ్చే గౌరవమంటూ క్షేత్రస్థాయిలో సెంటిమెంట్‌ను తమవైపు తిప్పుకున్నారు. ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న కంచెలు రక్షణ కవచాలుగా కాకుండా, కేసీఆర్ కుటుంబానికి రాజకీయంగా పెను సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.