Take a fresh look at your lifestyle.

ప్ర‌త్యేక టెట్ ప‌రీక్ష‌లో 70.07 శాతం పాస్‌

0 20

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • తదుప‌రి స్పెష‌ల్ టెట్ న‌వంబ‌రులో
  • ఫలితాల‌ను విడుద‌ల చేసిన
  • పాఠ‌శాల విద్యా డైరెక్ట‌ర్ నికోల‌స్‌

తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో 70.07 శాతం మంది టీచర్లు ఉత్తీర్ణత సాధించారు. ప్ర‌భుత్వ ఇన్‌స‌ర్వీస్ టీచ‌ర్ల‌కు ఈనెల 8, 9 తేదీలలో మూడు సెష‌న్ల‌లో జ‌రిగిన ప‌రీక్ష‌కు మొత్తం 22,477 మంది హాజ‌ర‌వ్వ‌గా, 15,749 మంది పాస‌య్యారు. స్కూల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ మ‌రియు కార్య‌ద‌ర్శి న‌వీన్‌ నికోల‌స్ శ‌నివారం స్పెష‌ల్ టెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. త‌దుప‌రి స్పెష‌ల్ టెట్ పరీక్ష న‌వంబ‌రులో నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌తి ఏడాది రెండు ప్ర‌త్యేక టెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో… అక్టోబ‌రు 1న నోటీఫికేష‌న్ విడుద‌ల చేస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష న‌వంబ‌రు 16 నుంచి 21 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. త‌దుప‌రి ప‌రీక్ష‌కు క‌నీసం 10 వేల మంది ప్రభుత్వ టీచ‌ర్లు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే కాకుండా రెగ్యుల‌ర్ టెట్ ప‌రీక్ష కూడా జ‌న‌వ‌రిలో ఉండే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

ప్రభుత్వ టీచ‌ర్లకు అంద‌రూ విధిగా టెట్ క్వాలిఫికేషన్ ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పు ద‌రిమిలా… తెలంగాణ‌లో స‌ర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల‌కు ఏటా రెండు ప్ర‌త్యేక టెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్య డైరెక్ట‌రేట్ ఈ ఏడాది రెండు ప‌రీక్ష‌లు జ‌రుపుతోంది. ఈనెల 8, 9 తేదీల‌లో జ‌రిగిన ఆన్‌లైన్ టెస్టులో పేపర్‌-I ప‌రీక్షను ఒక సెష‌న్లో తెలుగు, హిందీ, ఉర్దూ, క‌న్న‌డ‌, మ‌రాఠీ భాష‌ల‌లో… అలాగే పేప‌ర్‌-II ప‌రీక్ష‌ను రెండు సెష‌న్ల‌లో తెలుగు, హిందీ, ఉర్దూ, క‌న్న‌డ‌, మ‌రాఠీ, సంస్కృతం భాష‌ల‌లో నిర్వ‌హించారు. పేప‌ర్‌-IIలో మాథ‌మెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు ఒక సెష‌న్లో, సోష‌ల్ స్ట‌డీస్ రెండో సెష‌న్లో జ‌రిగాయి. మొదటిసారి రిజ‌ర్వేష‌న్ల వారీగా కూడా ఫలితాల‌ను ప్ర‌క‌టించారు. పూర్తి ఫ‌లితాల‌ను, మార్కుల‌ను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ పొంద‌వ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.