హైదరాబాద్ (మెట్రో న్యూస్):
పీఎంఎవైజీ పథకంలో భాగంగా రాష్ట్రానికి మిగతా 9.56 లక్షల ఇండ్లు కూడా కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రిని సీఎం మాదాపూర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతి పత్రం అందించడం తెలిసిందే. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని తాజాగా కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి వివరించారు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని కేంద్ర మంత్రికి తెలియజేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామన్నారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని సీఎం విన్నవించారు.