Take a fresh look at your lifestyle.

తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్

0 2

హైదరాబాద్, సెప్టెంబర్ 15:
తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీమతి బండారు విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో “తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ కోదండ రామ్ గారు ఎమ్మెల్సీ, శ్రీ అంజిరెడ్డి ఎమ్మెల్సీగారు, శ్రీ ప్రేమ్‌సింగ్ రాథోడ్ గారు, శ్రీ బీఎస్ రాములు గారు, శ్రీ పాశం యాదగిరి గారు, శ్రీమతి పాదూరి కరుణ గారు తదితర సామాజిక, రాజకీయ, చారిత్రక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో తమ రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల చారిత్రక సందర్భాలను అధికారికంగా నిర్వహిస్తున్న విధంగానే తెలంగాణలో కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా కోరారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు: బండారు దత్తాత్రేయ

ఈ సందర్భంగా శ్రీ బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు అని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, దోపిడీ, హింసను ఆయన వివరించారు.

కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలపై సాగించిన దమనకాండ, హింస, నరమేధాన్ని ఆయన ప్రస్తావించారు. సుమారు 13 నెలల పాటు రజాకార్ల అరాచకంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢమైన నాయకత్వంలో భారత సైనిక బలగాలు చేపట్టిన చర్యలతో నిజాం పాలనకు ముగింపు పలికి, తెలంగాణ ప్రాంతం భారత సమాఖ్యలో విలీనం అయిందని చెప్పారు. ఈ పరిణామంతో తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆ చారిత్రక ఘట్టాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ గారు అన్నారు.

చరిత్రను మరచిపోకూడదు: విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ, తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రజాకార్ల దమనకాండకు బైరాన్‌పల్లి ఒక విషాద సాక్ష్యంగా నిలిచిందని, అక్కడ జరిగిన ఘటనలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, త్యాగాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు.

తెలంగాణ విమోచన పోరాట చరిత్రను రాజకీయాలకు అతీతంగా చూడాలని, నిజానిజాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్ర, విమోచన పోరాటంలో అమరులైన వారి త్యాగాలకు సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.

ఇతర వక్తలు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరింత చేరువ చేయవచ్చన్నారు. తెలంగాణ విమోచనకు సంబంధించిన చారిత్రక ఆధారాలను సేకరించి, పరిశోధనలు ప్రోత్సహించి, పాఠ్యాంశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భావితరాలకు చరిత్రను పరిచయం చేయాలని సూచించారు.

తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చరిత్రకారులు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.