- చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇస్తున్నారన్న కవిత
- నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని విమర్శ
- పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని గుర్తించాలని సూచన
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, ఈ విషయం ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాలతో మరోసారి బహిర్గతమైందని ఆమె విమర్శించారు.
ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో రాష్ట్ర అధికారులు గోదావరి – కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ నుంచి చేపట్టాలని కోరుతుంటే… మరోవైపు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సమ్మతి తెలపడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కవిత ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని, 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున తాము దీనిని వ్యతిరేకించామని గుర్తుచేశారు. “రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ‘గురుదక్షిణ’గా చెల్లించుకుంటున్నారు” అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని గుర్తించాలని కవిత హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం జరిపే అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ తక్షణమే వైదొలగాలని, ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వెంటనే లేఖ రాయాలని ఆమె డిమాండ్ చేశారు.