(బీజింగ్):
టిబెట్‌లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ తీవ్రత 7గా నమోదు అయ్యింది. ఆ భూకంపం వల్ల 16 మంది మృతిచెందారు. సుమారు 46 మంది గాయపడ్డారు. దాదాపు 339 ఇండ్లు వరకు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. నాగకు ప్రాంతంలో భూమి కంపించింది. రాజధాని లాసాకు ఈశాన్య దిక్కున ఈ ప్రాంతం ఉన్నది. అనేక ప్రాంతాల్లో రోడ్డు మార్గం దెబ్బతిన్నది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లోని గ్రామాలు ఇబ్బందిపడుతున్నాయి. సముద్రమట్టానికి 4800 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అయితే చైనా ఆధీనంలో టిబెట్ ఉండడం వల్ల. .అక్కడ నుంచి వస్తున్న వార్తలన్నీ చైనా స్క్రీనింగ్ చేస్తోంది.
భూకంప ప్రభావిత ప్రాంతంలో సుమారు 1600 మంది స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. 100 ప్రీఫ్రాబ్రికేటెడ్ హౌజింగ్ యూనిట్లు , 3000 టెంట్లను పంపించారు. ఫ్లాష్లైట్లు, వింటర్ దుస్తుల్ని తరలించారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను ఆపేశారు. జాతీయ రహదారి 317ని స్వల్పంగా మూసివేశారు. అయితే భూకంపం సంభవించిన ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో స్వల్ప స్థాయిలో మంచుకురవనున్నట్లు వెదర్ అధికారులు చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.33 నిమిషాలకు భూకంపం వచ్చింది. సుమారు 18 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.