Take a fresh look at your lifestyle.

పథకాలే.. మంత్రుల బ్రాండ్‌!

0 17

హైదరాబాద్ : మెట్రో న్యూస్

ఒకప్పుడు నాయకుల పేర్లు వినగానే వారు అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు గుర్తుకు వచ్చేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంల లో, అనంతరం తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో కొన్ని పథకాలు చేపట్టారు. ఆ పథకాలు ఆయా ప్రభుత్వాల అధినేతలకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు, ఆయిల్‌ఫామ్‌ సాగు విస్తరణతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.శాఖలు, కార్యక్రమాలు ఎన్నున్నా.. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే పథకాలే మంత్రులకు ప్రత్యేక ముద్రను తీసుకొస్తున్నాయి. దీంతో గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో నాయకుడు అంటే పథకం అన్న రాజకీయ బ్రాండింగ్‌ ఇప్పుడు మంత్రుల స్థాయిలోనూ కనిపిస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార శాఖలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఆయన శాఖ కీలకంగా ఉంది. అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీంతో హౌసింగ్‌ శాఖపై, ముఖ్యంగా పొంగులేటి నిర్వహణపై సహజంగానే దృష్టి పెరిగింది. పథకం అమలు విస్తృతమైతే ఇళ్ల మంత్రి అనే ముద్ర మరింత బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ నాణ్యత, గడువులో ఇళ్ల పూర్తిచేయడం వంటి అంశాలు కీలకం కానున్నాయి.

ఆయిల్‌ఫామ్‌ వైపు తుమ్మల చూపు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఆయిల్‌ఫామ్‌ సాగు విస్తరణ ప్రభుత్వం చేపడుతున్న ముఖ్య కార్యక్రమాల్లో ఒకటిగా కనిపిస్తోంది. తెలంగాణ ఆయిల్‌ పామ్‌ మిషన్‌ ప్రకారం 2026,27లో 3.20 లక్షల ఎకరాలకు పైగా ప్రాంతం కవరవుతుండగా, వేలాది మంది రైతులు సాగులోకి వచ్చినట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ లో వచ్చిన అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.ఆయిల్ ఫామ్ లో తెలంగాణ దేశంలో నే మొదటి స్థానంలో నిలిచింది.
ఆయిల్‌ఫామ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు, సాగు విస్తరణ, రైతులకు మార్కెట్‌ అవకాశాలు కల్పించడం వంటి అంశాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట లో ఆయిల్‌ఫామ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
దీంతో వ్యవసాయ శాఖలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఆయిల్‌ఫామ్‌ కార్యక్రమం తుమ్మల రాజకీయ ప్రొఫైల్‌లో ప్రత్యేకంగా కనిపించే అంశంగా మారుతోంది ప్రభుత్వంలో ప్రతి మంత్రి పలు శాఖలు నిర్వహిస్తున్నా.. ప్రజలకు నేరుగా కనిపించే, పెద్ద ఎత్తున అమలయ్యే కార్యక్రమాలే మంత్రుల గుర్తింపును ప్రభావితం చేస్తుంటాయి. పొంగులేటికి హౌసింగ్‌ శాఖలో ఇందిరమ్మ ఇళ్లు, తుమ్మలకు వ్యవసాయ శాఖలో ఆయిల్‌ఫామ్‌ విస్తరణ అలాంటి కార్యక్రమాలుగా నిలుస్తున్నాయి.
అయితే పథకం పేరు మంత్రి పేరుగా మారడం కంటే.. పథకం ప్రజలకు ఎంతవరకు చేరింది అన్నదే అసలు కొలమానం. ఇళ్ల నిర్మాణం పూర్తయి పేద కుటుంబాలకు సొంత గూడు దక్కితే పొంగులేటి శాఖకు అది పెద్ద విజయంగా నిలుస్తుంది. అదే విధంగా ఆయిల్‌ఫామ్‌ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం, మార్కెట్‌ భరోసా లభిస్తే తుమ్మల వ్యవసాయ విధానాలకు అది బలమైన గుర్తింపుగా మారుతుంది.
మొత్తంగా.. ప్రభుత్వ పథకాల అమలే మంత్రుల పనితీరుకు మారుపేరుగా మారుతున్న వేళ. పొంగులేటికి ఇళ్లు తుమ్మలకు ఆయిల్‌ఫామ్‌ ప్రత్యేక గుర్తింపులుగా నిలుస్తున్నాయి.అయితే ఈ పథకాల ఫలితాలు అమలు వేగం, లబ్ధిదారులకు చేరుతున్న ప్రయోజనాలు ఆశించినంత మేర సాగితే ఈ పేర్ల ద్వారా వచ్చిన గుర్తింపు దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave A Reply

Your email address will not be published.