Take a fresh look at your lifestyle.

విమోచన స్ఫూర్తి భావితరాలకు చాటాలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

0 2

(మెట్రో న్యూస్):

హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్‌ 17 చారిత్రక ప్రాధాన్యాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ అన్నారు. హైదరాబాద్‌ విమోచన కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తూ ఈ వేడుకలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరేడ్‌, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
హైదరాబాద్‌ విమోచన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. వారి త్యాగాలు, పోరాటాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత వంటి విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉద్ఘాటించారు.
చారిత్రక సంఘటనలను వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేసి, వాటి నుంచి భావితరాలు స్ఫూర్తి పొందేలా చేయాలని రాధాకృష్ణన్‌ సూచించారు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave A Reply

Your email address will not be published.