Take a fresh look at your lifestyle.

ఖరీఫ్ ధాన్యం సేకరణ, నిల్వ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

0 7

ఖరీఫ్ 2026-27 సీజన్ ధాన్యం సేకరణకు, సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో, తహసీల్దార్లతో కలెక్టర్ ఖరీఫ్ ధాన్యం సేకరణ అంశంపై సమీక్ష జరిపారు.
ఈసారి జిల్లాలో 4.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని, 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించామని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం జిల్లాలో ఈసారి అన్ని ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గత రబీలో 660 కేంద్రాలు కొనసాగగా, ఈసారి అదనంగా 76 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం దిగుబడులు చేతికి అందనున్న దృష్ట్యా, అక్టోబర్ మొదటి వారం నుండే రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. గన్నీ బస్తాలు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషీన్లు, టార్ఫాలిన్లు సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. తగిన సదుపాయాలు సమకూర్చుకుని ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ చేసిన తరువాతనే ట్యాబ్ అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.

కాగా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఈసారి రైస్ మిల్లులకు పంపే అవకాశం లేనందున ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చేందుకు అవసరమైన గిడ్డంగులు, అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులతో పాటు మార్కెట్ కమిటీ గోడౌన్ లు, ప్రైవేట్ గిడ్డంగులను ధాన్యం నిల్వ కోసం క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడ కూడా ధాన్యం నిల్వ చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అన్నారు. అవసరమైన పక్షంలో ధాన్యం భద్రపర్చేందుకు వీలుగా మూతపడిన రైస్ మిల్లులు, పరిశ్రమలతో పాటు ఫంక్షన్ హాళ్లు, అనువైన ఖాళీ స్థలాలను కూడా గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పని చేస్తూ, ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.