Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు మ‌జ్లిస్‌కు భ‌య‌ప‌డుతున్నాయి కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి

0 3

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల‌ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ (హైదరాబాద్ ముక్తి దివస్) ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్క‌డ జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల పరేడ్ రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల స్మరించుకోవడం కోసమే భారత ప్రభుత్వం అధికారికంగా ‘హైదరాబాద్ ముక్తి దివస్’ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంద‌న్నారు.

1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర పండుగ చేసుకుంటుంటే, ఆనాడు నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మనకు స్వాతంత్య్రం రాలేదని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సైతం పక్కనపెట్టి, ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడిస్తూ.. తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిష‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.