సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన కౌన్సిల్ చైర్మన్
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణ శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలను శాసనమండలి చైర్మన్ సస్పెండ్ చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని రెండురోజుల పాటు జరిగిన చర్చ తర్వాత అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేవపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దానిని మండలికి పంపించారు. శాసనసభ వాయిదా పడిన వెంటనే మండలి సమావేశాలను ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే లేచి… ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని… తక్షణమే సస్పెండ్ చేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంలో లేజిస్లేచర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు… ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి ఓటింగ్ జరగ్గా… వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ఆ తర్వాత మండలి కూడా వాయిదా పడింది.