హైదరాబాద్ (మెట్రో న్యూస్):
శాసనసభాపతి స్థానంలో ఉన్న సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన సభ గౌరవానికి, స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. సభాపతిని అవమానించడం అంటే మొత్తం సభను అవమానించడమేనని స్పష్టం చేశారు. ఇది సభా ధిక్కారానికి సమానమైన వ్యవహారమని అన్నారు. సభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అన్ని పార్టీల సభ్యులు ఎన్నుకున్నారని, ఆయనను ఆ స్థానంలో కూర్చోబెట్టి సభను నడిపించే బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు.
సభలో జరిగిన రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు ఫామ్ హౌస్‌లో బిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగిందని, ఆ ‘ఫామ్ హౌస్ కాన్స్పిరసీ’లోనే ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు పథకం రచన చేశారని ఆరోపించారు. సభలో టీషర్టులు, నల్లచొక్కాలు ధరించి వాటిపై నినాదాలు రాసుకుని రావడాన్ని కూడా భట్టి తప్పుబట్టారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానం ‘స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ’ని పూర్తిగా దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై, సామాజిక సమానత్వంపై దాడి చేసే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులను, అవమానాలకు పాల్పడే వారిని, ఆత్మగౌరవంపై దాడి చేసే బీఆర్ఎస్ పార్టీని శాసనసభలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.