హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి:
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్‌ను రాజీనామా చేయమని మాట్లాడుతున్నారు… వారిని నేనే అడుగుతున్నా.. ఎవరు రాజీనామా చేయాలి? రాజీనామా ఎందుకు చేయాలి? తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలా? రేవంత్ రెడ్డే రాజీనామా చేయాలి. 100 రోజులు అని చెప్పి 1000 రోజులు మోసం చేసినందుకు రాజీనామా చేయాలి. నిరుద్యోగులను నిండా ముంచినందుకు పార్టీ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన విద్యార్థులు, యువత సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదే కరీంనగర్‌లో, 2006లో ఇదే కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడారు… ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ రాజీనామా చేస్తే ఏమైందో గుర్తుందా? 2006లో కాంగ్రెస్ వీపు పగిలింది… ఆయనతో పెట్టుకోవద్దు… ఇప్పుడు కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మళ్లీ అదే అవుతది.. యాదిలో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. చేసిన మోసాలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు 420 హామీలకు 420 సార్లు రాజీనామాలు చేయాలని మండిపడ్డారు.