Take a fresh look at your lifestyle.

Seed Ganesh | సీడ్ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి పిలుపు

0 9

Seed Ganesh | పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే విగ్రహంలోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని తెలిపారు.Seed Ganesh | సీడ్ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి పిలుపుSeed Ganesh | వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని కోరారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తుందని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న సంతోష్ కుమార్‌ను అభినందించారు. ఆయన చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.

వినాయక చవితి సందర్భంగా పండుగ ఉత్సాహంతో పాటు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.

ఆశీస్సులతో పాటు ఆరోగ్యాన్ని అందించాలి

‘‘సీడ్ గణేశుడిని ఆరాధించడం ద్వారా అటు పుణ్యం.. ఇటు పురుషార్థం.. అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత దక్కుతుంది’’ అని చిరంజీవి అన్నారు. ‘‘వినాయక చవితి వచ్చిందంటే ఊరూవాడా వేడుకలే. అయితే ఇటీవల పోటీ పెరిగిపోవడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. దీంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. పండుగతో అందరికీ ఆరోగ్యం అందాలి. భగవంతుడి ఆశీస్సులు లభించాలి. ఈ నేపథ్యంలో సోదర సమానుడైన సంతోష్ సీడ్ గణేశాను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం’’ అని చెప్పారు.

పూజ అనంతరం సీడ్ గణేశుడిని ఇంట్లోనే నిమజ్జనం చేస్తే దేవుడే మొక్కగా మారి ఆశీర్వదించినట్లవుతుందని చిరంజీవి పేర్కొన్నారు. సీడ్ మొక్కగా మారడంతో వినాయకుడిని పూజించినట్లే కాకుండా మొక్కను నాటిన బాధ్యత కూడా పూర్తవుతుందని వివరించారు.

మొక్కలు నాటడం ఇప్పుడు అవసరం

కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడం కేవలం ఎంపిక కాదని, అది అవసరమని సంతోష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొనే హరితహారం స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటాలి, వాటిని మూడేళ్లు పెంచాలి, మరో ముగ్గురిని నామినేట్ చేయాలి అనే ఫార్ములాతో కొనసాగుతోంది.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 19.6 కోట్ల మొక్కలు నాటినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పండుగను కేవలం వేడుకగా కాకుండా పర్యావరణ ఉద్యమంగా మార్చే సీడ్ గణేశా కార్యక్రమాన్ని పౌరులు, హౌసింగ్ సొసైటీలు, ఆలయ కమిటీలు స్వీకరించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోరుతోంది.

దేవుడే.. వృక్షమైతే..

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల చెరువులు, నదులు కలుషితమవుతున్న నేపథ్యంలో సీడ్ గణేశా ఆలోచనకు రూపకల్పన చేశారు. పూర్తిగా సహజమైన మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. విగ్రహం లోపల వేప, చింత వంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతున్నారు.

నవరాత్రుల పూజల అనంతరం భక్తులు ఈ విగ్రహాన్ని కుండలో లేదా పెరట్లోని మట్టిలో ఉంచి నీళ్లు పోస్తే సరిపోతుంది. విగ్రహం క్రమంగా కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా దేవుడి ప్రతిమ మొక్కగా మారి ఇంట్లోనే పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

కరోనా సమయంలో మొదలైన సీడ్ గణేశా

సీడ్ గణేశా కార్యక్రమం 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రారంభమైంది. అప్పటి అటవీశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో ఏటా సుమారు 1.5 లక్షల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

2023లో కూకట్‌పల్లి నెక్సస్ మాల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ ఆధ్వర్యంలో పిల్లల్లో పర్యావరణ అవగాహన కల్పించారు. 2025లో స్వర్ణగిరి ఆలయంలో నటుడు నారా రోహిత్ సమక్షంలో ఏకంగా 5 లక్షల సీడ్ గణేశా విగ్రహాల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు. తాజాగా 2026 సీజన్ కోసం మెగాస్టార్ చిరంజీవి సీడ్ గణేశా ప్రతిమలను ఆవిష్కరించడంతో ఈ కార్యక్రమం మరింత మందికి చేరువ కానుంది.

Leave A Reply

Your email address will not be published.