Take a fresh look at your lifestyle.

గోల్డ్ మైనింగ్‌లోకి సింగరేణి! ‎

0 28

రాయ‌చూరు (మెట్రో న్యూస్‌):

క‌ర్ణాట‌క‌లోని బంగారు గ‌నుల‌ను సంద‌ర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

‎‎దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయంగా అన్వేషించి వెలికితీయడంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలన్నారు. ‎బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ‎కర్ణాటక గోల్డ్‌ మైన్స్‌ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్‌ జిల్లాలోని హట్టి, యూటి  బంగారు గనులను డిప్యూటీ సీఎం సందర్శించారు. బంగారు ఖనిజం తవ్వకం నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు చేపడుతున్న ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు.

‎హట్టి గోల్డ్‌ మైన్స్‌కు బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్‌, శుద్ధిలో అపార అనుభవం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని హట్టి అనుభవంతో జోడించాలని సూచించారు. ‎బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర అంశాల్లో రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ‎బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హట్టి–సింగరేణి భాగస్వామ్యంతో బంగారం ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్థానిక ఉపాధి కల్పనతోపాటు దేశ ఆర్థికాభివృద్ధికి మేలు జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.