Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ‘ఏఐ’ మార్కెట్ విప్లవం దేశానికే ఆదర్శంగా డిజిటల్ యార్డులు

0 1

హైదరాబాద్ (మెట్రో న్యూస్ ):

తెలంగాణలోని రైతు మార్కెట్ యార్డులను పూర్తిస్థాయి డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు చెక్ పెడుతూ, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యాపారంలో పూర్తి పారదర్శకతను అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వినూత్న వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. సచివాలయంలో ప్లానింగ్ అండ్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రైతులు యార్డులోకి అడుగుపెట్టినప్పటి నుంచి లాట్ ఐడీ కేటాయింపు, డిజిటల్ వేలం, పంట నాణ్యత పరీక్షలు ఆన్‌లైన్ చెల్లింపులు ఈ-రసీదుల జారీ వరకు అంతా ఒకే డిజిటల్ వేదికపై నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మాన్యువల్ జోక్యానికి తావులేకుండా ఐటీ శాఖ సమన్వయంతో వారం రోజుల్లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. గోదాముల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ కోసం యార్డుల్లో ఏఐ పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు, దేశవ్యాప్త మార్కెట్ ధరలను ప్రదర్శించే డిజిటల్ స్క్రీన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లోని డిజిటల్ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ యార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా ప్రతీ లావాదేవీని పారదర్శకంగా నమోదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయడంతో పాటు మొదటగా ఎక్కువ లావాదేవీలు జరిగే మార్కెట్లలో ఈ సాంకేతికతను అమలు చేసి, ఆపై రాష్ట్రమంతటా విస్తరింపజేయనున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, కోహెడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న ‘ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్’ నిర్మాణ పనుల జాప్యంపై మంత్రి తుమ్మల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థ సూచించిన భూమి చదును సవరణలకు ముఖ్యమంత్రి ఆమోదం పొంది, వారం రోజుల్లోగా నిర్మాణ టెండర్లను ఆహ్వానించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది మార్చి (2027) నాటికి మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేసి రైతుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.