Take a fresh look at your lifestyle.

ఎల్‌నినోని అడ్డుపెట్టుకొని ధరలను పెంచితే క‌ఠిన చ‌ర్య‌లు

0 8

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

వ్యాపారుల‌కు మంత్రి ఉత్తమ్ హెచ్చ‌రిక‌

ఎల్‌నినో పేరును అడ్డుపెట్టుకొని వ్యాపారులు నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను పెంచితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చ‌రించారు. ఈ మేరకు శుక్రవారం రోజున బేగంపేట కుందన్‌బాగ్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిప‌డ్డారు. బ్లాక్‌మార్కెటింగ్‌, అడ్డగోలు ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌న్నారు. బీపీటీ బియ్యం కిలో రూ.66కు మించకుండా నియంత్రణ చర్యలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యం నాణ్యత, ఉత్పత్తి వ్యయాల ఆధారంగా ధరపై సమీక్ష జ‌ర‌గాల‌న్నారు.

అక్రమ నిల్వలు, అధిక ధరల ఆరోపణలపై బియ్యం వ్యాపారులపై ఇప్పటికే 12 కేసులు నమోదుచేశామ‌ని, శాఖల సమన్వయంతో బియ్యం వ్యాపార కేంద్రాల్లో ముమ్మర దాడులు కొన‌సాగుతున్నాయ‌ని, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేప‌ట్టామ‌ని, బేగంబజార్‌, నాంపల్లి, మహరాజ్‌గంజ్‌ టోకు మార్కెట్లలో సోదాలు చేశామ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. బియ్యం ధరలు స్థిరపడే వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగాల‌ని మంత్రి సూచించారు. రాష్ట్రంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని తెలిపారు. కొరత భయంతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేయొద్దన్నారు.

Leave A Reply

Your email address will not be published.