Take a fresh look at your lifestyle.

రూ.600 కోట్లతో ఇన్ఫోసిస్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రం

0 13

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. 10 వేల సీట్ల సామర్థ్యం

ప్రపంచ ఐటీ, ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇన్ఫోసిస్‌ సంస్థ హైదరాబాద్‌లోని పోచారం ప్రాంగణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన నూతన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి భవనాన్ని ప్రారంభించడం రాష్ట్ర ఐటీ రంగ ప్రగతిలో మరో కీలక మైలురాయని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తరణ హైదరాబాద్‌పై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారులు, ఐటీ రంగ ప్రతినిధులు హాజరయ్యారు.

కొత్త భవనం ద్వారా అదనంగా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చిందని, ఇందులో 10 వేల సీట్ల సామర్థ్యం ఉందని మంత్రి వివరించారు. సుమారు 450 ఎకరాల్లో విస్తరించిన పోచారం ఇన్ఫోసిస్‌ ప్రాంగణ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.3,200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

ప్రతిభావంతులైన యువత, ప్రముఖ విద్యాసంస్థలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం హైదరాబాద్‌ బలాలని పేర్కొన్నారు. ఐటీతో పాటు ఔషధాలు, జీవసాంకేతికత, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తోందన్నారు.

కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ భద్రత, ఇంజినీరింగ్‌ సేవలు, నూతన తరం డిజిటల్‌ సాంకేతికతలు భవిష్యత్తులో హైదరాబాద్‌ ఐటీ రంగ వృద్ధికి కీలకంగా మారనున్నాయని శ్రీధర్‌బాబు అన్నారు.

ప్రపంచ సాంకేతిక, ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం, విద్యాసంస్థలతో పరిశ్రమల అనుసంధానాన్ని పెంచడం, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ జయేశ్‌ సంఘరాజ్కా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు సునీల్‌ కుమార్‌ ధారేశ్వర్‌, రాజనీష్‌ మాల్వియా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిలాద్రి ప్రసాద్‌ మిశ్రా, డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ ప్రణబ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.