తమిళనాడులోని తేని జిల్లాలో ఒక సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకున్న ఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి తేక్కంపట్టి సబ్ జైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. జైలు సిబ్బందిపై దాడి చేసి ఖైదీలు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. పరారైన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. పరారైన 17 మంది ఖైదీలు ఒకే సెల్‌లో ఉన్నారు. సోమవారం రాత్రి సమయంలో తమలో ఒకరికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చినట్లు నాటకమాడారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే స్పందించి సహాయం అందించేందుకు సెల్‌లోకి ప్రవేశించారు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక గార్డు తలకు తీవ్ర గాయమవగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బందిని గాయపరిచిన అనంతరం ఖైదీలు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనపై సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిదారి స్పందించారు. పరారైన ఖైదీల్లో మధురైకి చెందిన ఒకరిని జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. మిగిలిన 16 మంది కోసం 17 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. పొరుగున ఉన్న మధురై, దిండుగల్ జిల్లాలతో పాటు కేరళలోని ఇడుక్కి జిల్లాలోనూ హై అలర్ట్ ప్రకటించారు.

అన్ని సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరారైన ఖైదీల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు, ప్రజలకు చేరేలా ప్రసార మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.