(మెట్రో న్యూస్)
భూపాలపల్లి కేటిపిపి లో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, కాంట్రాక్ట్ కార్మికులతో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐఎన్టియూసి అనుబంధం 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అనేక కీలక కార్మిక చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కార్మికుల సంక్షేమానికి కృషి చేసి 8 గంటల పని దినం అమలుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. జెన్కో , సింగరేణి, ఆర్టీసీ తో పాటు అన్ని రంగాల కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరించే విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఐఎన్టియుసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలకమైన కార్మిక సంఘంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, ఐఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ జెన్కో ఉద్యోగులు, ఆర్టిజన్లు, కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.