Take a fresh look at your lifestyle.

కరవు, ఎల్ నినో ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన టీజీ ప్రభుత్వం, ఆరుగురు మంత్రులతో కమిటీ

0 17
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కమిటీ చైర్మన్ బాధ్యతలు
  • కమిటీలో మొత్తం ఆరుగురు మంత్రులకు చోటు
  • కరవు పరిస్థితులను పర్యవేక్షించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్న కమిటీ

రాష్ట్రంలో నెలకొన్న కరవు, ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి, నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనుండగా, ప్రణాళికా శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులను ఈ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సంబంధిత శాఖలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది.

నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో అనేక మండలాల్లో కరవు ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కరవు నివారణ చర్యలపై దృష్టి సారించి, ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.