హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- డిసెంబరు 9న సెంట్రల్ కిచెన్ల ప్రారంభం
- ప్రభుత్వ విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారన్నారు. శుక్రవారం హరేకృష్ణ ఫౌండేషన్‌కు రెండు సంస్థలు విరాళాలు అందజేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలి. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తాం. జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇది. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలని, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఎం సమక్షంలో ఒప్పందం కుదర్చుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.
వికారాబాద్లోనూ ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్‌లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందజేశారు. గొప్ప కార్యక్రమానికి నిధులు అందించిన సంస్థల ప్రతినిధులను సీఎం రేవంత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.