హైదరాబాద్ (మెట్రో న్యూస్):
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిళ్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
గత పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేసిందని, సంక్షేమ శాఖల కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించలేదని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కేంద్రీకృత యంత్రాల వంటశాలలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ఎస్సీ స్టడీ సర్కిళ్లపై చేసిన వ్యయం, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య, వారికి అందించిన శిక్షణ, సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. స్టడీ సర్కిళ్ల ద్వారా వస్తున్న ఫలితాలు, పెట్టుబడికి అనుగుణంగా వస్తున్న ప్రయోజనాలపై వివరణాత్మక అంచనా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యమైన కోచింగ్ అందించాలని సూచించారు.