హైదరాబాద్ (మెట్రో న్యూస్):
గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకువచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్కకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్లను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం మాటల్లో కాదు.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక, పరిపాలనా స్వేచ్ఛ కల్పించినప్పుడే అది నిజమైన గ్రామ స్వరాజ్యం అవుతుంది. ఆ దిశలో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది” అని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం గ్రామ పంచాయతీ అభివృద్ధికే ఉపయోగపడాలి. ప్రజల నుంచి వసూలు చేసిన సొంత ఆదాయం కోసం పంచాయతీలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు” అని అన్నారు. గ్రామ పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు బలపడతాయని, గ్రామాలు బలపడితేనే తెలంగాణ అభివృద్ధి బలపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పచ్చదనం వంటి అనేక ప్రజా అవసరాలు నేరుగా పంచాయతీలతో ముడిపడి ఉంటాయని మంత్రి చెప్పారు. “పంచాయతీలను నిధుల కోసం ఎదురుచూసే సంస్థలుగా కాకుండా, తమ సొంత ఆదాయంతో తమ గ్రామ అవసరాలను తీర్చుకునే స్వయం పాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలి” అని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే చట్ట సవరణకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.