Take a fresh look at your lifestyle.

భారత్‌కు చమురు కష్టాలు.. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ రేట్లు భారీగా పెరిగే అవకాశం?

0 2

Petrol Price | న్యూఢిల్లీ  : అమెరికా-ఇరాన్‌ యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై ఇరాన్‌కు మద్దతిచ్చే హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో మిడిల్‌ ఈస్ట్‌లో అశాంతి పెరిగితే క్రూడాయిల్‌ ధరలు మరింతగా విజృంభించడం ఖాయమన్నది ఇప్పుడు మెజారిటీ విశ్లేషకుల మాట.

దాడులతో 120 డాలర్లకు..

దేశ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో రష్యాతోపాటు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల వాటానే ఎక్కువ. అయితే యుద్ధంతో యూఏఈ, సౌదీ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు ముడి చమురు, గ్యాస్‌ రాక ఇబ్బందికరంగా మారింది. పెట్రో ఉత్పత్తుల రవాణాకు కీలకమైన హొర్ముజ్‌ జలసంధిలో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా ఉన్నది మరి. నౌకలపై దాడులు జరిగితే బ్యారెల్‌ విలువ 120 డాలర్లను తాకగలదన్న అంచనాను గోల్డ్‌మన్‌ సాచ్స్‌ వ్యక్తం చేస్తున్నది.

అమెరికాకు మద్దతిస్తున్నాయని గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులకు దిగుతున్న సంగతి విదితమే. అలాగే హొర్ముజ్‌ జలసంధిలో నౌకల రవాణానూ అడ్డుకుంటున్నది. దీనివల్ల భారత్‌ సహా వివిధ ఆసియా దేశాలకు చమురు, గ్యాస్‌ రవాణాకు బ్రేకులు పడుతున్నట్టవుతున్నది. అంతేగాక భారత్‌ నుంచి ఆయా దేశాలకు జరిగే చమురేతర ఉత్పత్తుల ఎగుమతులకూ విఘాతం కలుగుతున్నది. అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో ఇంధన, ఇంధనేతర దిగుమతులూ ప్రియమవుతున్నాయి. నౌకలు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండగా, బీమా ఖర్చులూ పెరిగిపోయాయని దిగుమతిదారులు అంటున్నారు. ఇది తమకు నష్టం చేకూరుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మారుతున్న ఆటో మార్కెట్‌ ట్రెండ్‌

పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్‌ వాహన కొనుగోలుదారుల ఆలోచనా సరళి మారుతున్నది. గత నెల ఆగస్టులో ప్యాసింజర్‌ వెహికిల్‌ రిటైల్‌ అమ్మకాల్లో సీఎన్‌జీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల వాటా 41.9 శాతానికి ఎగిసింది. పెట్రోల్‌ ఆధారిత వాహనాల వాటా 40.8 శాతంగానే ఉన్నట్టు భారతీయ ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) తెలియజేసింది. డీజిల్‌ ఆధారిత వాహన విక్రయాలు 17.2 శాతంగా ఉన్నాయన్నది. ఇక మొత్తం ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో సీఎన్‌జీ వాటా 25.2 శాతంగా ఉన్నది. హైబ్రిడ్‌ వెహికిల్స్‌ 9 శాతంగా, విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ) 7.6 శాతంగా ఉన్నట్టు ఎఫ్‌ఏడీఏ పేర్కొన్నది. కాగా, ఆగస్టులో అన్ని రకాల ఈవీల రిటైల్‌ అమ్మకాలు 2.98 లక్షలుగా ఉన్నాయి.

ఒత్తిడిలో దేశ ఆర్థిక వ్యవస్థ

మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెంపునకు దారితీస్తున్నాయని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదని అంటున్నారు. చమురు దిగుమతుల చెల్లింపుల భారం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విజృంభణ, రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపు, స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు, రూపాయి మారకం విలువ క్షీణత, చమురు ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖరీదెక్కడం, ఎగుమతుల పతనం వంటివి దేశ ఎకానమీని రిస్క్‌లో పడేస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న మిడిల్‌ ఈస్ట్‌ వార్‌ మొదలవగా.. అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశంలో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.7.35, డీజిల్‌ ధర రూ.7.53 ఎగిసిన విషయం తెలిసిందే. నిజానికి అమెరికాతో ఇరాన్‌ చర్చల కారణంగా అప్పట్లో కొంతమేర శాంతియుత పరిస్థితులు మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్నాయి. ఇది మార్కెట్‌లో క్రూడ్‌ ధరల తగ్గుముఖానికి కలిసొచ్చింది. అయితే మళ్లీ దాడులు మొదలవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో భారత ముడి చమురు దిగుమతుల విలువ 56 శాతం పెరిగి 63.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే సమయంలో 40.5 బిలియన్‌ డాలర్లేనని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.