మెట్రో న్యూస్ ఎల్ బి నగర్:
గ్రీన్ పార్క్ కాలనీ సరస్వతి నగర్ లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఆపదలో ఉన్నవారికి అండగా సేవా కార్యక్రమాలు
గ్రీన్ పార్క్ కాలనీ సరస్వతి నగర్ శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ నిత్య పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ సేవా సమితిని నిత్య శుద్ధానంద గిరి స్వామివారు ప్రారంభించారు. అనంతరం గత 18 సంవత్సరాలుగా లక్ష్మీ శేఖర్ ఆధ్వర్యంలో నిత్య పారాయణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది.
సత్సంగ్‌లో భాగంగా ఒక్కొక్కరి ఇంట్లో 21 రోజుల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు సైతం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి వీలుగా ఒకరోజు పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత, సేవాభావం పెంపొందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. సత్సంగ్ కార్యక్రమాలను కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు కూడా అనుసంధానం చేస్తున్నారు.
ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు సత్సంగ్ సభ్యుల నుంచి విరాళాలు స్వీకరించి, అవసరమైన వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. భక్తి, సేవ, మానవతా విలువలను కలగలిపి శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ్ సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అన్నారు.