హైదరాబాద్ :
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి పదవులపై చర్చ జరుగుతోంది. ఇందులో ప్రదానంగా టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ భవిష్యత్ పాత్ర ఏమిటన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా కూడా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో కొండా సురేఖ బర్తరఫ్ తో ఖాళీగా మంత్రి పదవుల సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారా? లేక ప్రభుత్వంలో మంత్రి పదవి చేపడతారా? అన్న చర్చ ఇంటా బయటా జోరుగా సాగుతోంది.
అయితే ఇప్పటివరకు మంత్రి వర్గ విస్తరణ కు సంబందించి అధికార సమాచారం అటు పార్టీ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి లేనప్పటికి మహేష్ గౌడ్ విషయం లో మాత్రం చర్చ సాగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కీలకంగా మారిన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్‌ను కొనసాగించడం లేదా మంత్రి పదవి కేటాయించే విషయం లో పార్టీ అధిష్టానం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికి మహేష్ గౌడ్ నిర్ణయం ఆధారంగానే ఫైనల్ చేయాలనే ఒక వ్యూహం అధిష్టానం లో కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహారాలు, కేడర్ సమన్వయం, రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి బాధ్యతలు ఆయన ముందున్నాయి.
పైగా సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ గౌడ్ ఇటీవల చెప్పడం కూడా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్న సంకేతం కూడా పార్టీ పెద్దలు మదిలో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వంలో కీలక బాధ్యత అప్పగిస్తే బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతకు ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుందన్న వాదన కాంగ్రెస్‌లో ఉంది. ఇప్పటికే మహేశ్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం సంపాదించుకున్నారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే పార్టీ ప్రభుత్వ సమన్వయంలోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
పీసీసీ అధ్యక్ష పదవి పార్టీపై ప్రత్యక్ష నియంత్రణను ఇస్తుంది. మంత్రి పదవి మాత్రం ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. దీంతో మహేశ్ గౌడ్‌కు ఏ బాధ్యత అప్పగించాలన్నది కేవలం వ్యక్తిగత అంశం కాకుండా సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వ్యూహం, ప్రభుత్వ అవసరాలు వంటి అంశాలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.మహేశ్ గౌడ్ విషయం లో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆయనే దే ఫైనల్ గా తెలుస్తోంది.