Take a fresh look at your lifestyle.

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్

0 15

16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా ల‌బ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొని డ్రా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.