తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలకు కరెక్ట్‌గా సరిపోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయం లేదు.. దాన్ని క్యాష్ చేసుకునేంత సామర్థం ప్రతిపక్ష బీఆరఎస్‌కు లేదని ఆయన తేల్చేశారు. సాధారణంగా ప్రతిపలు అధికార పార్టీని విమర్శించడం సహజమే అయినా, ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించి, శాసనసభలో మిత్రపక్షంగా కొనసాగుతున్న సీపీఐ అగ్రనేత నుంచే ఈ మాటలు రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయ లోపం ఉందన్న కూనంనేని పరిశీలన క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వ యంత్రాంగం, మంత్రుల మధ్య, అలాగే పార్టీ , కేబినెట్ మధ్య సరైన సమన్వయం కనిపించడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయంపై మరొకరికి సమాచారం లేకపోవడం, ముఖ్య నేతల మధ్య అంతర్గత ఆధిపత్య పోరు, అధికారులపై పూర్తిస్థాయి పట్టు లేకపోవడం వంటి సమస్యలు పాలనను తరచూ గందరగోళంలోకి నెడుతున్నాయి. చివరకు మిత్రపక్షమైన సీపీఐకి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, స్థానిక సమస్యలు, నిధుల కేటాయింపుల్లో సంప్రదించకపోవడం వంటి పరిణామాలు ప్రభుత్వ పనితీరులోని లోపభూయిష్ట సమన్వయాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇంతటి అంతర్గత వైరుధ్యాలు, పాలనాపరమైన గందరగోళం ఉన్నప్పటికీ.. వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆరఎస్ ఘోరంగా విఫలమవుతోందన్నది కూనంనేని విశ్లేషణలోని రెండో కీలక కోణం. ప్రభుత్వం వరుస తప్పిదాలు చేస్తున్నా, ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ రూపం ఇవ్వడంలో బీఆరఎస్ నాయకత్వం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ.. ప్రజలకు నేరుగా సంబంధం లేని రాజకీయాలకు పరిమితమైపోయింది. కేవలం ప్రెస్ మీట్లు, ట్విట్టర్ వేదికలకే విమర్శలను పరిమితం చేస్తూ, ప్రజాక్షేత్రంలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించలేకపోతోంది.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీగా ప్రజల నాడిని పట్టుకోవడంలో, వారి సమస్యలకు స్వరం ఇవ్వడంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల వ్యూహాలు ప్రస్తుత రాజకీయ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సహజమైన అవకాశాలు ఎన్ని వస్తున్నా, వాటిని ఒక పక్కా రాజకీయ అజెండాగా మార్చి ప్రజామోదం పొందడంలో బీఆరఎస్ వెనుకబడిపోతోంది. ఒకవైపు బీజేపీ క్రమంగా పుంజుకుంటూ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండగా, బీఆరఎస్ మాత్రం తనకు లభించిన రాజకీయ అవకాశాలను ఒడిసిపట్టలేక పూర్తి అసమర్థతను కనబరుస్తోందన్నది కూనంనేని మాటల ఆంతర్యం. ఒకవైపు పాలనలో సమన్వయం లేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నానాటికీ అసంతృప్తిని మÖటగట్టుకుంటుంటే.. మరోవైపు ఆ వ్యతిరేకతను ఒడిసిపట్టి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నిలబడే శక్తి, వ్యూహాత్మక సామర్థం లేక బీఆరఎస్ కొట్టుమిట్టాడుతోంది.