హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- 22ఏ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు లేవు
- 98, 31,320 ఎకరాలు శాశ్వతంగా నిషేధిత జాబితాలో ఉంటాయ్
- 3,73,930 ఎకరాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం
22ఏ నిషేధిత జాబితా సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభా వేదికగా ప్రకటించారు.
ధరణి అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ నెలరోజుల్లో దర్యాప్తు చేస్తుందన్నారు. ఇదంతా పార్ట్-1 మాత్రమేనని… వచ్చే బడ్జెట్ సెషన్స్‌లో బీఆర్ఎస్ సభ్యుల సమక్షంలో పార్ట్-2 అక్రమాల చిట్టా బయటపెడతానన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 22ఏ వివాదాన్ని పరిష్కరించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు.
కోటి ఎకరాలను తమ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో ఉంచామన్నది శుద్ధ అబద్దం అని సీఎం స్పష్టం చేశారు. మొత్తం 98 లక్షల 31వేల 320 ఎకరాలు శాశ్వతంగా నిషేధిత జాబితాలో ఉండేవేనన్నారు. అవి తొలగించాలని కేసీఆర్ అడుగుతారా అన్నారు. ఇక మిగిలిన 3,73,930 ఎకరాలు వివిధ కారణాలతో నిషేధిత జాబితాలోకి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
యూఎల్‌సీ, హెచ్ఎండీఎ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ, సింగరేణి భూములు, జీఓ-59 సమస్య, జీవో-118 (ఎల్బీనగర్), అసైన్డ్ భూములలో నిర్మించిన గృహాలు, ఇందిరమ్మ పథకంలో ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన ఇండ్లు, ఇందిరమ్మ పథకంలో లబ్దిదారుని స్థలంలో ప్రభుత్వం వ్యయంతో నిర్మించిన ఇండ్లు, ప్రైవేట్ పట్టా భూములు (నాలా), ప్రభుత్వ భూములలో అనధికారిక లేఅవుట్లు, కాలనీలు, సికింద్రాబాద్ పరిధిలో లీజ్‌హోల్డ్ ఆస్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్‌మెంట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా ఉంటామన్నారు.