Take a fresh look at your lifestyle.

కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామర్థ్యంతో కమ్యూనిటీ కిచెన్

0 2

పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, హాజరు, విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్టనర్ గా చేపట్టిన ” స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్” ను కరీంనగర్ జిల్లాలో విస్తరిస్తోంది.

ఇందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులోసుమారు రూ.8 కోట్ల వ్యయంతో, రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సెప్టెంబర్ 16న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.

కరీంనగర్‌లోని ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా అమలు చేయనుంది.

అల్పాహారం వల్ల ఉపయోగాలు

ఉదయం పూట విద్యార్థులు ఆకలితో ఉండకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారు పాఠశాలలో చురుకుగా పాల్గొనే అవకాశం పెరుగుతుంది. అల్పాహారం విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞానాత్మక సామర్థ్యం, భావోద్వేగ అభివృద్ధి, తరగతి గది భాగస్వామ్యం, విద్యా పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుంది.

అల్పాహారం అందుబాటులో ఉండటం వల్ల పాఠశాల హాజరు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి కోసం తెల్లవారుజామునే పనులకు వెళ్లే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఒక సాధారణ అల్పాహారం ఆకలి కారణంగా వచ్చే అలసటను నివారించి, విద్యార్థులకు అభ్యాసానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది పిల్లల భవిష్యత్తుపై, తద్వారా భవిష్యత్ దేశ నిర్మాణంపై పెట్టే చిన్న కానీ విలువైన పెట్టుబడి.

 

కోడంగల్‌లో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం

ఈ అల్పాహార కార్యక్రమాన్ని 2024 డిసెంబర్‌లో కోడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ కార్యక్రమం అమలుతో విద్యార్థుల హాజరు 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు గుర్తించారు.

అదేవిధంగా ఉదయం సమయంలో విద్యార్థులలో ఏకాగ్రత పెరగడం, తరగతి గదిలో భాగస్వామ్యం మెరుగుపడటం, సమయపాలన పెరగడం, ఆలస్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటి సానుకూల ఫలితాలు నమోదయ్యాయి.

పాఠశాలలకు అందుతున్న ఈ మద్దతుపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ కోడంగల్‌లో పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు:

– 17,72,291 మంది విద్యార్థులు
– 23,106 ప్రభుత్వ పాఠశాలలు
– 31 జిల్లాల్లో 31 కేంద్రీకృత మెగా/కమ్యూనిటీ కిచెన్లు
– 1,400 పంపిణీ వాహనాలు
– సుమారు 5,000 మంది సిబ్బంది

ప్రయోజనం పొందేలా ప్రతిపాదిత అమలు నమూనాను రూపొందించారు.

కేంద్రీకృత వంటశాలల ప్రత్యేకత కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ల ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు పోషకమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన అల్పాహారాన్ని నిర్ణీత సమయంలో అందించేందుకు వీలు కలుగుతుంది.

దోస, మిల్లెట్ ఇడ్లీ, పూరీ వంటి ప్రత్యేక మెనూలను పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో అందించడం కేంద్రీకృత వంటశాలల ద్వారా సాధ్యమవుతుంది.

అలాగే వంటగది పనుల నుంచి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది విముక్తి పొంది పూర్తిగా బోధన, విద్యార్థుల అభ్యాసంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

కిచెన్లలో ISO స్థాయి పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంతో పాటు, థర్మల్ ఇన్సులేటెడ్ వాహనాల ద్వారా అల్పాహారాన్ని పాఠశాలలకు సకాలంలో తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా కేంద్రీకృత వంటశాలల్లో సుమారు 15,000 ప్రత్యక్ష, 10,000 పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాల (SHG) సేవలను కూడా కొనసాగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి.

కరీంనగర్‌లో విద్యార్థులకు అందించే వారపు మెనూ విద్యార్థులు సాధారణంగా ఇళ్లలో తినే ఆహార పదార్థాలను ఆధారంగా చేసుకుని మెనూను రూపొందించారు. దీంతో విద్యార్థులు సులభంగా స్వీకరించడంతో పాటు ఆహార వృథాను తగ్గించవచ్చు.

వారపు మెనూ:

– సోమవారం: ఇడ్లీ – సాంబార్
– మంగళవారం: పూరీ – ఆలూ కుర్మా
– బుధవారం: దోశ – చట్నీ
– గురువారం: ఉప్మా – చట్నీ
– శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ – సాంబార్
– శనివారం: బోండా – చట్నీ

విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోషక సమతుల్యత కోసం ఆహారంలో అవసరమైన పోషకాలను చేర్చడంతో పాటు, విద్యార్థుల వయస్సుకు తగిన మోతాదులో, వారికి సుపరిచితమైన ఆహార పదార్థాలతో మెనూను రూపొందించారు. ఈ మెనూ రూపకల్పనలో NIN సహకారం తీసుకున్నారు.

కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అల్పాహారం పొందే విద్యార్థులు

– హుస్నాబాద్ నియోజకవర్గం: 16,544 మంది విద్యార్థులు
– మానకొండూర్ నియోజకవర్గం: 8,645 మంది విద్యార్థులు
– చొప్పదండి నియోజకవర్గం: 7,481 మంది విద్యార్థులు
– కరీంనగర్ నియోజకవర్గం: 16,355 మంది విద్యార్థులు

మొత్తంగా 49,025 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ అల్పాహారం అందనుంది.

రూ.245 కోట్లతో 31 కమ్యూనిటీ కిచెన్లు రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 కమ్యూనిటీ కిచెన్లను సుమారు రూ.245 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం, హాజరు వంటి అంశాలను సమగ్రంగా మెరుగుపరిచి, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ఆకలితో ఉన్న పిల్లవాడు చదువుపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేడు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఉత్సాహంగా పాఠశాలకు వచ్చి చదువుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అల్పాహారం పథకం విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడటంతో పాటు పేద తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.