హైదరాబాద్ (మెట్రో న్యూస్):
గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఉదంతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామని తేల్చిచెప్పారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… సెప్టెంబర్ 6న జరిగిన కుట్ర నుంచి జరిగిన అన్ని సంఘటనలను క్రోడీకరించి అందరిపై సంపూర్ణ విచారణ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది అని ప్రకటించారు. స్పీకర్‌పై దుర్భాషలాడటం… అంటరానితనం ఘటనలను పార్లమెంట్, ముంబై, పుల్వామా ఘటనలతో పోల్చారు. చట్టాలు, సెక్షన్లు అడ్డు పెట్టుకుని కొంతమందికి బెయిల్ పొందొచ్చు… కానీ తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభుత్వం విచారణ చేపట్టి శిక్షించాలని నిర్ణయించింది. జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరపాలని అసెంబ్లీ వేదికగా విచారణకు ఆదేశించారు.
విద్యా రంగంలో అక్రమాలు, ధరణి అక్రమాలు, 22 ఏ రాద్ధాంతంపై సభలో చర్చించాలని అనుకున్నాం. కానీ ఫామ్ హౌస్‌లో కుట్ర చేసి తమ సభ్యులను సభను అడ్డుకునేందుకు ఉసిగొల్పారు. సమస్యలపై చర్చ జరిగితే వారి పదేళ్ల దురాగతాలు, అప్పులపై ప్రజలకు అవగాహన కలుగుతుందని భయపడ్డారు. పార్లమెంట్‌పై దాడి చేసిన వాళ్లకు, ముంబై దాడులకు పాల్పడిన కసబ్‌కు, పుల్వామాలో సైనికులపై దాడిచేసిన తీవ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన వారికి పెద్ద తేడా లేదు. ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించారని సీఎం ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష నాయకుడు కెసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారు. కానీ అలా జరగకపోగా మరింత ఉన్మాదంతో వ్యవహరించారు. అందుకే… ఏ ఫామ్ హౌస్ లో కుట్ర జరిగిందో ఆ ఫామ్ హౌస్ ముందు దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారు. కేవలం డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారు. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించి తీవ్రంగా అవమానించారు. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు జాతుల మధ్య వైరంగా మార్చాలని అనుకుంటున్నారు. వాళ్లు దళితులు నడిచిన నేలను శుద్ధిచేస్తే.. వారి మనసుల్లో పేరుకున్న అంటరాని తనాన్ని ఎలా శుద్ధి చేయాలి. నీళ్లతో కడగాలా? యాసిడ్‌తో కడగాలా? అంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.