Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌ తీరుపై డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆగ్రహం

0 6

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభా నియమావళిని ప్రతి సభ్యుడు పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి సభాపతితో వాగ్వాదానికి దిగడం, ఆయన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలని చెప్పారు. ఈ సభ, ఈ రాష్ట్రం ఆత్మగౌరవంపై ఏర్పడింది. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు మంచిది కాదు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. సభాపతిని అవమానించేలా వ్యవహరించిన అనంతరం ఇంకా ఏం న్యాయం కావాలని ఆయన ప్రశ్నించారు. ఏం జస్టిస్ కావాలి? జస్టిస్ కావాల్సింది ఈ రాష్ట్రంలోని దళిత, బహుజన వర్గాలకు. జస్టిస్ కావాల్సింది గిరిజనులకు. మీ చేతుల్లో అవమానాలకు గురైన ప్రజలందరికీ జస్టిస్ కావాలని భట్టి విక్రమార్క అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహనం పాటిస్తోందని, అయినప్పటికీ సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. దొరతనపు పోకడలను తెలంగాణ ప్రజలు ఇక భరించడానికి సిద్ధంగా లేరని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి సంబంధించిన ‘శుద్ధి కార్యక్రమం’ అంశంపై శాసనసభలో చర్చ జరగాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభా గౌరవాన్ని కాపాడటంతో పాటు సామాజిక న్యాయం, ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని సభా కార్యక్రమాలను సజావుగా సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.