హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రతిపక్ష పార్టీ సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ… ఈ వివాదానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ నాయకత్వం బాధ్యత వహించాలన్నారు. మీకు జరిగిన అవమానం చిన్న విషయం కాదు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తిగా మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఈ సభ గౌరవాన్ని అవమానించడమే అని ధ్వజమెత్తారు. మీరు ఎదుర్కొన్న అవమానంపై దళిత సోదరులు ఎర్రవల్లి వద్ద నిరసన వ్యక్తం చేస్తే, వాళ్లను మరింత అవమానించే విధంగా అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఏం సంస్కారం అధ్యక్షా? తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం కాదా? అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఆత్మగౌరవం కోసం. కానీ అదే తెలంగాణలో ఒక దళిత బిడ్డను, ఈ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఉన్న మిమ్మల్ని అవమానించడం చాలా బాధాకరం.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసఆర్ దీనికి సమాధానం చెప్పాలి. అదే విధంగా కేటీఆర్, హరీశ్‌రావు కూడా దీనిపై తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం చిన్నతనం కాదు. తప్పు తెలుసుకొని వెనక్కి తగ్గడం రాజకీయ పరిపక్వత. కానీ జరిగిన అవమానాన్ని సమర్థించుకోవడం, దానికి పశ్చాత్తాపం కూడా లేకపోవడం మరింత బాధాకరం అన్నారు. ప్రజల సమస్యల మీద చర్చ జరగాల్సిన ఈ అసెంబ్లీని వ్యక్తిగత రాజకీయాలకు, చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదు. ప్రతిపక్షానికి ప్రజా సమస్యల మీద మాట్లాడే పూర్తి హక్కు ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి… కానీ స్పీకర్‌ను అవమానించే హక్కు ఎవరికీ లేదు అధ్యక్షా. మీకు జరిగిన అవమానానికి ప్రధాన ప్రతిపక్ష నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ఒక్క స్పీకర్‌కు జరిగిన అవమానం కాదు. దళిత సమాజానికి, ఈ సభకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన అవమానం. తెలంగాణలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదు అని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.