హైదరాబాద్ : మెట్రో న్యూస్
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మరోసారి ఉద్యమబాట పట్టింది. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర డిమాండ్ల సాధన కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించారు.33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట కూడా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను తక్షణమే అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలనీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని దీనికి తోడు పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించడం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను సమర్థంగా అమలు చేయడం వంటి అంశాలను కూడా ఉద్యోగులు ధర్నా సందర్బంగా డిమాండ్ చేశారు.చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఎదురుచూశామని, స్పందన లేకపోవడంతోనే ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని జేఏసీ నేతలు వెల్లడించారు.సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.