హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందరిమ్మ టవర్స్‌లో 7,340 ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. అర్హుల జాబితా నేటి నుంచి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందని అన్నారు. అభ్యంతరాలను ఈనెల 23 సాయంత్రంలోపు తెలియజేయాలని అన్నారు.
- ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు
- లాటరీకి తేదీలు ఫిక్స్
- ఈనెల 27 నుంచి 30 వరకు లాటరీ
![Indiramma Towers Indiramma Towers]()
- హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి ఫ్లాట్లు కేటాయించేందుకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
- క్యూర్ పరిధిలోని మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్‌లోని 7,340 ఇళ్ల కోసం ప్రభుత్వం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన లబ్ధిదారులను గుర్తించి తుది జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లాట్ల కేటాయింపులో పారదర్శకత కోసం లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు. అర్హులైన దరఖాస్తుదారుల తుది జాబితాను నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు. దరఖాస్తుదారులు తమ పేరు, దరఖాస్తు వివరాలు, అర్హతకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించుకోవచ్చు. జాబితాలో ఏదైనా తప్పు లేదా అభ్యంతరం ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోపు అధికారులకు తెలియజేయాలన్నారు.అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత లాటరీలో పాల్గొనే తుది దరఖాస్తుదారుల జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు. అనంతరం 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు ఫ్లాట్లను కేటాయించనున్నారు. నియోజకవర్గాల వారీగా కేటాయింపుల ప్రక్రియను నిర్వహించనున్నారు. లాటరీ ప్రక్రియకు సంబంధించి సందేహాలు లేదా ఇతర సమాచారం అవసరమైతే 040-24603572 నంబర్‌లో సంప్రదించాలని హౌసింగ్ బోర్డు తెలిపింది. లాటరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు ఫ్లాట్ల కేటాయింపు తదుపరి దశలో చేపట్టనున్నారు.