Take a fresh look at your lifestyle.

అంతరిక్షంలో అమెరికా ఆయుధాలు.. తొలిసారి బహిరంగ ప్రకటన

0 3
  • కక్ష్యలో అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నట్లు స్పేస్‌ ఫోర్స్‌ ప్రకటన
  • వీటిని ‘స్పేస్‌ కంట్రోల్‌ వెపన్స్‌’గా పేర్కొన్న అమెరికా
  • ఆయుధాల సంఖ్య, స్థానం, రకాలను వెల్లడించని అగ్రరాజ్యం
  • రక్షణతో పాటు దాడి చర్యల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని వెల్లడి
  • చైనా, రష్యాలను ప్రధాన అంతరిక్ష ముప్పులుగా గుర్తిస్తున్న అమెరికా

అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ‘స్పేస్‌ కంట్రోల్‌ వెపన్స్‌’ కక్ష్యలో ఉన్నాయని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ వెల్లడించింది. శత్రు దేశాల దాడుల నుంచి అమెరికా, మిత్రదేశాల బలగాలను రక్షించేందుకే వీటిని మోహరించినట్లు తెలిపింది. అయితే ఆయుధాల సంఖ్య, వాటి స్థానం, ఏ తరహా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ కార్యదర్శి ట్రాయ్‌ మెయింక్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా సాయుధ బలగాలపై శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను మరింత పెంచుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కక్ష్యలోనే శత్రు చర్యలను ఎదుర్కోగల అంతరిక్ష ఆయుధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ ఆయుధాలు ‘కైనెటిక్‌, నాన్‌-కైనెటిక్‌’ విధానాల్లో పనిచేయగలవని స్పేస్‌ ఫోర్స్‌ తెలిపింది. అవసరాన్ని బట్టి రక్షణతో పాటు దాడి చర్యల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే అవి ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలా, ఇతర రకాల వ్యవస్థలా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

అంతరిక్ష రంగంలో చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. ఉపగ్రహాలు సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌కు కీలకం కావడంతో వాటిపై ఆధిపత్యం భవిష్యత్‌ యుద్ధాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమెరికా తొలిసారి కక్ష్యలో ఆయుధాల ఉనికిని బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

1967 నాటి ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ అంతరిక్షంలో సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపును నిషేధిస్తుంది. అయితే అన్ని రకాల సంప్రదాయ సైనిక సామర్థ్యాలపై నిషేధం లేదు.

Leave A Reply

Your email address will not be published.