Take a fresh look at your lifestyle.

చక్కెరతో క్యాన్సర్‌

0 2

షుగర్‌ అధికంగా ఉండే పానీయాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న విషయం తెలిసిందే! అయితే, అది కేవలం బరువు పెరగడమో, మధుమేహం రావడానికో మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంటున్నారు. కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు ఎక్కువగా తాగితే.. కడుపు క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు అవుతుందని హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల్లో భాగంగా, ఈ విషయాలను వెల్లడిస్తున్నారు.

సాధారణ కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌, ప్యాక్‌ చేసిన ఫ్రూట్‌ జ్యూస్‌లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటారు. అయితే, ఇలాంటి వాటిని అస్సలు ముట్టుకోని వారు, చాలా అరుదుగా తాగేవారితో పోలిస్తే.. ప్రతిరోజూ తాగేవారికి కడుపు క్యాన్సర్‌ వచ్చే అవకాశం రెండు రెట్లకు పైగా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

ఈ పానీయాలలోని అధిక చక్కెర.. జీర్ణవ్యవస్థలో అంతర్గత ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఇది కణాలను దెబ్బతీస్తుంది. ఇక ద్రవరూపంలోని చక్కెర నేరుగా శరీరంలోకి వెళ్లినప్పుడు.. రక్తంలో గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’కు దారితీసి, క్యాన్సర్‌ కణాలు పెరిగేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా, కృత్రిమ చక్కెరలు జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాపై ప్రభావం చూపి, హానికర రసాయనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇదికూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సోడాలు, కృత్రిమ పండ్ల రసాలకు బదులుగా మంచి నీరు, నిమ్మకాయ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను ఎంచుకోవడం మంచిదని అంటున్నారు. ప్యాక్‌ చేసిన డ్రింక్స్‌ కొనేటప్పుడు లేబుల్‌పై ఉండే ‘షుగర్స్‌’ పరిమాణాన్ని తప్పకుండా గమనించాలని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.