హైదరాబాద్ (మెట్రో న్యూస్):
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా పర్యావరణ హితమైన హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ “తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025” విశేషాలను వివరించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కేవలం 15,497 మెగావాట్లుగా మాత్రమే ఉండేదని, అయితే సెప్టెంబర్ 9 నాటికి అది 19,543 మెగావాట్లకు చేరిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. వివిధ కారణాల రీత్యా ఈ ఏడాది డిమాండ్ 20,000 నుంచి 21,000 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని, ఈ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే సాంప్రదాయ, నాన్-సాంప్రదాయ ఇంధన వనరులను సమన్వయం చేస్తూ ఈ నూతన పాలసీని తెచ్చినట్లు తెలిపారు.
సభ్యులు కొమురయ్య ప్రస్తావించిన పంప్డ్ స్టోరేజ్ విధానం కొత్తదేమీ కాదని, కాంగ్రెస్ హయాంలోనే నాగార్జున సాగర్‌లో దీన్ని విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ తయారీకి 1.5 నుండి 2 సంవత్సరాలు, ఉత్పత్తిలోకి రావడానికి 5 నుండి 8 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 10 మంది ప్రతిపాదకులు ముందుకు వచ్చారని, డీపీఆర్ సమర్పించిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కొక్కరు 2 మెగావాట్ల చొప్పున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు ప్రాంతంలో (అప్పర్ ప్లాటో) పైలట్ ప్రాజెక్ట్‌గా పూర్తి సోలరైజేషన్ పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంప్సెట్లకు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ.14,000 కోట్లు, 53 లక్షల గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.5,000 కోట్లు చెల్లిస్తోందని… ఇలా కేవలం సబ్సిడీల రూపంలోనే ఏటా దాదాపు రూ.19,000 కోట్లు ఖర్చవుతోందని ఆయన వివరించారు. ఈ నిధులను సోలరైజేషన్ వైపు మళ్లిస్తే ఖజానాపై భారం తగ్గడంతో పాటు రైతులు స్వయంసమృద్ధి సాధిస్తారన్నారు.
పగటిపూట లభించే సోలార్ విద్యుత్ రాత్రివేళ అందుబాటులో ఉండనందున, ఎంపిక చేసిన గ్రామాల్లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌తో మైక్రో గ్రిడ్లను నిర్మిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
సోలార్ విద్యుత్‌తో పాటు బ్యాటరీ స్టోరేజ్ ద్వారా గ్రామాలకు విద్యుత్ ఇచ్చే ‘మైక్రో గ్రిడ్’ ప్రాజెక్టులను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టామని ఆయన సభకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విజిఎఫ్ ద్వారా మూడుసార్లు టెండర్లు పిలిచినా, బ్యాటరీ స్టోరేజ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో సాంకేతికత పెరిగి బ్యాటరీ ధరలు తగ్గితే ఈ ప్రాజెక్టులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భూముల ధరలు ఎకరాకు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పైగా ఉండటంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పెట్టుబడిదారులకు ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదని స్పష్టం చేశారు. పరిగి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిమిత పవన విద్యుత్ (విండ్ పవర్) అవకాశాలపై అధ్యయనం చేసి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు.
కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందని, ఇటీవల కరీంనగర్లో ఒక ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. మణుగూరు వద్ద సింగరేణి చేపట్టిన మిథేన్ గ్యాస్ ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాలేదని, అయితే కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం జరుపుతున్నామని తెలిపారు. దేవాదాయ, ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని, సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిపిఏలు కుదుర్చుకున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.