హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వఖరిపై ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, దామోదర్, పొన్నం, సీతక్క, అడ్లూరి, వాకిటి, వివేక్, అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా అత్యున్నత హోదాలో ఉన్న గవర్నర్ జోక్యం చేసుకుని, శాసనసభ ప్రాంగణంలోనూ, వెలుపలనూ దళితులు, మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి ప్రత్యేకంగా, ఉద్దేశపూర్వకంగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపింది.
మరణించిన తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం ద్వారా స్పీకర్‌ను తీవ్రంగా బాధించడమే కాకుండా, మొత్తం దళిత సమాజాన్ని, రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలందరినీ అవమానించించారని పేర్కొంటూ వినతిపత్రం సమర్పించింది. దళిత సోదరులు, సోదరీమణులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలు చల్లి ‘శుద్ధి’ చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనైతికమైన అంటరానితనం ఆచరణను బీఆర్‌ఎస్ ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా, బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై కూడా అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కోరారు.